rina dwivedi: ఆ ఎన్నికల అధికారి వెరీ స్పెషల్... అదిరే లుక్‌తో ఆకట్టుకుంటున్న రీనా ద్వివేదీ!
- సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లో శారీతో అదరహో
- ఇటీవల ఉప ఎన్నికల్లో పింక్ శారీలో ప్రత్యేక ఆకర్షణ
- విధి నిర్వహణతోపాటు ఫ్యాషన్‌లోనూ టాప్
రీనా ద్వివేదీ...ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లో శారీతో విధులకు వెళుతూ ప్రత్యేక లుక్‌తో జిగేల్‌మన్న ఈ అమ్మడు, రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పింక్ అండ్ గోల్డ్ డిజైనర్ శారీతో విధులు నిర్వహించి మరోసారి జిగేల్ మన్నారు.
దీంతో విధుల నిర్వహణతోపాటు ఫ్యాషన్‌లోనూ ఆమె తనకు తానే సాటిగా నిలిచారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వివరాల్లో వెళితే...ఎన్నికల విధుల్లోకి వెళ్లే అధికారులు సాధారణంగా హడావుడిగా, ఆపసోపాలు పడుతూ వెళ్తున్నట్లు కనిపిస్తారు. అయితే, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రీనా ద్వివేది మాత్రం తన ప్రత్యేకతను చాటుకుని మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎల్లో శారీతో చలువ కళ్లద్దాలు ధరించి ఈవీఎం బాక్స్‌తో సెలెబ్రిటీ లుక్ తో స్టైలిషగా వెళ్లిపోతున్న ఆమె పలువురు మీడియా ఫొటోగ్రాఫర్లను ఆకట్టుకోవడంతో కెమేరాలు క్లిక్ మన్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఓటర్ల వివరాలు రాసుకుంటూ, ఇంక్ మార్కు వేస్తూ ఓ చేతికి బ్రాస్లెట్, మరో చేతికి రిస్ట్ వాచ్‌తో నేర్పుగా పనిచేస్తున్న ఆమెను ఆసక్తిగా నెటిజన్లు గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆమెకు ఫాలోవర్లు పెరిగారు.
ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 4,700 మంది, టిక్‌టాక్‌లో 8,700 మంది ఫాలో అవుతున్నారు. చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్న రీనాకు పదిహేనేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె పీడబ్ల్యూడీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆ హోదాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆమె సార్వత్రిక ఎన్నికల్లో స్పెషల్ టాక్‌గా మారారు. అది అప్పటికే పరిమితం అనుకుంటే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె స్పెషల్ లుక్‌కు నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.
అయితే దీన్ని రీనా లైట్ గా తీసుకున్నారు. స్టార్ డంపై స్పందన కోరితే 'అది అనుకోకుండా అలా జరిగిందంతే' అని ముక్తాయించారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తించి ప్రత్యేకంగా గౌరవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.