Tamil Nadu: జీన్స్ ధరించిందని.. డ్రైవింగ్ టెస్టుకు నిరాకరించిన అధికారులు
- చెన్నైలోని కేకేనగర్ ఆర్టీవో కార్యాలయంలో ఘటన
- షార్ట్ ధరించి వచ్చిన మరో యువతికీ అదే అనుభవం
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకేనన్న అధికారులు
జీన్స్ ధరించి డ్రైవింగ్ టెస్టుకు హాజరైన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకుని సాధారణ దుస్తులు ధరించి వస్తేనే డ్రైవింగ్ టెస్టుకు అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో ఆ యువతి విస్తుపోయింది. చెన్నైలోని కేకేనగర్ ఆర్టీవో కార్యాలయంలో జరిగిందీ ఘటన. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, టెస్టు కోసం వెళ్లిన ఆమెను ఎగాదిగా చూసిన అధికారులు ఆమెతో టెస్టు చేయించేందుకు నిరాకరించారు. వెళ్లి దుస్తులు మార్చుకుని కుదురైన డ్రెస్‌లో రావాలని సూచించారు. అంతేకాదు, షార్ట్ ధరించి వచ్చిన మరో మహిళకూ ఇటువంటి అనుభవమే ఎదురైంది.
డ్రెస్ కోడ్ నిబంధనలు అమల్లో లేకున్నా అధికారులు అలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్టీవో అధికారి స్పందించారు. షార్ట్స్, లుంగీలు, బెర్ముడాస్ ధరించి వచ్చిన పురుషులను కూడా తిప్పి పంపినట్టు వివరణ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే కార్యాలయానికి కుదురైన దుస్తులు ధరించి రమ్మని చెప్పడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. ప్రతి రోజూ కార్యాలయానికి వందలాది మంది వస్తుంటారని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలా కోరామని, ఇది మోరల్ పోలీసింగ్ కిందకు రాదని వివరణ ఇచ్చారు.