Katchuluru: నా పట్టుదల, మా వాళ్ల సహకారంతో బోటు వెలికితీశాం: ధర్మాడి సత్యం
- బోటును బయటకు తీసేందుకు మొత్తం 3 రోప్స్ వేశాం
- 24 మీటర్ల లోతులో నుంచి బోటును బయటకు లాగాం
- ఈ ఆపరేషన్ లో మా బ్యాచ్ 25 మంది పాల్గొన్నారు
కచ్చులూరు వద్ద గోదావరిలో ముప్పై ఎనిమిది రోజుల క్రితం మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించి కొంచెం సేపటి క్రితం వెలికితీసింది. ఈ బోటును వెలికితీసేందుకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ బృందం కష్టపడింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యంను మీడియా పలకరించింది.
బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రోజున పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. వరద నీటి ప్రవాహం పెరిగిపోవడం కారణంగా వెలికితీత పనులు మధ్యలో ఆగిపోయాయని, ఆ తర్వాత మళ్లీ చేయడం జరిగిందని చెప్పారు. నిన్న నదిలో ప్రవాహం పెరిగిందని, అయినప్పటికీ, బోటును బయటకు తీయాలన్న పట్టుదలతో పనులు ఆపలేదని అన్నారు. బోటును బయటకు తీసేందుకు మొత్తం మూడు రోప్స్ వేశామని, అందులో రెండు రోప్స్ ను కింద నుంచి వేసి బయటకు లాక్కురాగలిగామని చెప్పారు.
మొదటిరోజున నదిలో లోతు సుమారు 26 మీటర్లు ఉండగా, ఈ రోజు 24 మీటర్ల లోతు ఉందని, ఆ లోతులో నుంచి బోటును బయటకు తీశామని, బోటు వెలికితీత పనుల్లో తమ బ్యాచ్ 25 మంది పాల్గొన్నట్టు వివరించారు. ఈ ఆపరేషన్ లో రెవెన్యూ, పోలీస్, పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని చెప్పారు. ‘నా పట్టుదల, మా వాళ్ల సహకారం, నా అనుభవం వల్లే ఈ బోటును వెలికితీయగలిగాం. నేను హ్యాపీగా ఫీలవుతున్నా’ అని అన్నారు.