India: పౌరులపై నిఘా పెట్టడంలో భారత్ కు మూడో స్థానం!
- తొలి రెండు స్థానాల్లో రష్యా, చైనా
- ఏడో స్థానంలో అమెరికా
- బ్రిటన్ అధ్యయన సంస్థ క్రాంపిటెక్ వెల్లడి
పౌరులపై నిఘా పెట్టడంలో భారత్ ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పౌరులపై నిఘా పెడుతున్న దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. బ్రిటన్ కు చెందిన అధ్యయన సంస్థ క్రాంపిటెక్ ఈ వివరాలను వెల్లడించింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆయా దేశాల్లో రక్షణ, గోప్యత, డేటా పరిరక్షణకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న అవకాశాలు, బయో మెట్రిక్ డేటా అప్ డేటింగ్ తదితర అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 47 దేశాల్లో అధ్యయనం చేపట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఐదు అంశాల్లో భారత్ కు 2.5 పాయింట్లు వచ్చాయి. పెద్దన్న దేశంగా పేరుపడ్డ అమెరికా 2.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువగా ఉన్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. కొన్ని దేశాల్లో ప్రజల డేటాకు పరిరక్షణ ఉన్నప్పటికి.. ప్రైవసీకి ప్రాధాన్యత తక్కువగా ఉందని నివేదికలో తెలిపింది.
భారత్ తర్వాత స్థానాల్లో ఆసియా దేశాలైన థాయ్ లాండ్, మలేసియాలున్నాయి. భారత్‌లో ప్రజల డేటా పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోయినప్పటికి, ప్రైవసీ అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా కొనసాగుతోంది. అయినప్పటికీ భారత్‌లో ప్రైవసీకి రక్షణ లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ గుర్తింపు కార్డు కింద దాదాపు 123 కోట్ల మందికి చెందిన డేటా ఒకే చోట నిక్షిప్తమై ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. ఆ డేటా రక్షణకు ప్రత్యేక చట్టాలేమీ లేవు. వాట్సాప్ లాంటి సోషల్ మీడియాకు కూడా ప్రైవసీ లేదు. వీటిలోని సమాచారం సులువుగా ఇతరులకు అందే అవకాశముంది. మరోవైపు ప్రజల డేటా పంపిణీ, పర్యవేక్షణకు భారత్ కు పదిదేశాలతో ఒప్పందం ఉంది. ఈ కారణాలను విశ్లేషించిన క్రాంపిటెక్ భారత్ లో ప్రైవసీ పరిరక్షణకు తక్కువగా అవకాశాలున్నాయని తెలిపింది.