Bangladesh: సమ్మె ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెటర్లు... భారత్ తో టి20, టెస్టు సిరీస్ లపై అనిశ్చితి
- డిమాండ్ల సాధన కోసం బంగ్లా క్రికెటర్ల సమ్మె బాట
- నవంబర్ 3 నుంచి భారత్ లో బంగ్లాదేశ్ పర్యటన
- డిమాండ్లు ఆమోదిస్తేనే క్రికెట్ అంటున్న ఆటగాళ్లు
తమ డిమాండ్ల ఆమోదం కొరకు బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెకు దిగారు. న్యాయబద్ధమైన తమ 11 డిమాండ్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆమోదించే వరకు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లోను తాము పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెటర్లు స్పష్టం చేశారు. షకీబల్ హసన్, తమీమ్ ఇక్బాల్ వంటి సీనియర్ క్రికెటర్లు ఈ మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మహ్మదుల్లా, మెహదీ హసన్, అరాఫత్ సన్నీ, జునైద్ సిద్ధిఖీ, ఇనాముల్ హక్, తస్కిన్ అహ్మద్ తదితర క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.
కాగా, బంగ్లాదేశ్ జట్టు నవంబర్ 3 నుంచి భారత్ లో పర్యటించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం 3 టి20 మ్యాచ్ లు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాలి. ఆటగాళ్లకు పారితోషికం చెల్లింపుల విధానం మార్చాలని, ఢాకా ప్రీమియర్ లీగ్ , నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లకు సరైన సదుపాయాలు కల్పించాలనేవి ఆటగాళ్ల ప్రధాన డిమాండ్లు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈవో నిజాముద్దీన్ చౌదరి మాట్లాడుతూ, తమకు ఆటగాళ్ల సమ్మె గురించి ఇప్పుడే తెలిసిందని, దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ లో ఇది ముసలం అని భావించట్లేదని అన్నారు.
ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ జట్టు దారుణంగా ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపై పరాజయం పాలవడంతో ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ తీవ్రంగా పరిగణించింది. ఇకనుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి జట్టు ఒక లెగ్ స్పిన్నర్ ను విధిగా ఆడించాలని ఆదేశించింది. ఆఫ్ఘన్ మణికట్టు స్పిన్నర్లను ఆడడంలో తడబాటు కారణంగానే బంగ్లాదేశ్ జట్టు ఓటమిపాలైందని క్రికెట్ పండితులు విశ్లేషించిన దరిమిలా బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పాటించని రెండు ఫ్రాంచైజీల హెడ్ కోచ్ లపైనా వేటు వేసింది.
అయితే, దీనిపై సీనియర్ ఆటగాడు షకీబల్ హసన్ స్పందిస్తూ, చాలా ఏళ్లుగా తాము లెగ్ స్పిన్నర్ లేకుండానే ఆడి విజయాలు సాధించామని, ఇప్పుడు కొత్త నిబంధన కారణంగా బంగ్లా ప్రీమియర్ లీగ్ లో ఏడుగురు లెగ్ స్పిన్నర్లు ఆడనుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు.