Change With In: హిందీ సినీరంగం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం: మోదీపై ఖుష్బూ వ్యాఖ్యలు
- తన నివాసంలో బాలీవుడ్ తారలకు ప్రధాని ఆతిథ్యం
- 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమంలో కనిపించిన దక్షిణాది తారలు
- మోదీ వైఖరిపై విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ తారలకు తన నివాసంలో ఆతిథ్యం అందించారు. 'చేంజ్ విత్ ఇన్' అనే కార్యక్రమంలో భాగంగా మోదీ బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అయితే ప్రధాని వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అపోలో ఫౌండేషన్ అధినేత ఉపాసన కొణిదెల ఈ విషయమై మోదీని సుతిమెత్తగా విమర్శించారు. దక్షిణాది తారలను కూడా గుర్తించండి అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తాజాగా, ప్రముఖ నటి ఖుష్బూ కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు.
భారత చలనచిత్ర రంగం అంటే హిందీ సినిమా రంగం ఒక్కటే కాదన్న విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం గుర్తించాలని హితవు పలికారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం అందిస్తోంది హిందీ చిత్రపరిశ్రమ ఒక్కటే కాదని, దక్షిణాది చిత్రపరిశ్రమల నుంచి కూడా భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పాటు అందుతోందని ఖుష్బూ తెలిపారు.
ఎంతోమంది సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి వచ్చారని, ఎందుకు 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమానికి దక్షిణాది ప్రముఖులను పిలవలేదని ప్రశ్నించారు. ఇది దక్షిణాదిపై వివక్ష చూపించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధాని నిర్వహించిన 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.