Pakistan: 'పాక్ పై మోదీ అప్రకటిత యుద్ధం'... పీవోకేలో భారత ఆర్మీ దాడులపై పాక్ మీడియా స్పందన

  • భారత్ అనవసరంగా కాల్పులకు తెగబడిందంటూ కథనాలు
  • తమ దేశ ఆర్మీ ప్రతిఘటించిందని వ్యాఖ్య 
  • తొమ్మిది మంది భారత జవాన్లను పాక్ హతమార్చిందన్న డాన్ పత్రిక

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలతో పాటు ఆ దేశ ఆర్మీ పోస్ట్ లపై నిన్న భారత ఆర్మీ దాడులు చేసిన విషయం తెలిసిందే. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో కొందరు ఉగ్రవాదులతో పాటు ఐదుగురు పాక్ ఆర్మీ సిబ్బంది కూడా హతమయ్యారు. సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ కాల్పులు, పీవోకేలో మరోసారి శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యల కారణంగా భారత్ ఈ దాడులు చేపట్టింది. అయితే, దీనిపై పాక్ మీడియా పలు రకాలుగా కథనాలు ప్రచురించింది.

పాక్ ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినప్పటికీ భారత్ అనవసరంగా కాల్పులకు తెగబడిందని పాక్ పత్రికలు పేర్కొన్నాయి. అజాద్ కశ్మీర్ (పీవోకే) లోని పలు గ్రామాల్లో భారత్ కాల్పులకు తెగబడడంతో, తమ దేశ ఆర్మీ ప్రతిఘటించి తొమ్మిది మంది భారత జవాన్లను హతమార్చిందని డాన్ పత్రిక చెప్పుకొచ్చింది. అక్కడ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ చేస్తోన్న ప్రకటనలను పాక్ ఖండించిందని పేర్కొంది.

పాక్ పై భారత ప్రధాని మోదీ అప్రకటిత యుద్ధం ప్రారంభించారని న్యూస్ ఇంటర్నేషనల్ అనే మీడియా చెప్పుకొచ్చింది. అజాద్ కశ్మీర్ లో భారత్ ఎటువంటి కారణం లేకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాడులు చేసిందని మరో పాక్ మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లో ఓ పాక్ జవానుతో పాటు మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News