Movie Artists Association: ‘మా’ తీరుపై నిప్పులు చెరిగిన నటుడు పృథ్వీరాజ్
- ‘మా’ సర్వసభ్య సమావేశం వుందంటే వచ్చాను
- ఈ మీటింగ్ చూస్తే దౌర్భాగ్యంగా వుంది
- ఈ సమావేశంలో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘మా’ సమావేశంపై ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మా’ సర్వసభ్య సమావేశం వుందని తిరుపతి నుంచి వచ్చానని, ఈ మీటింగ్ చూస్తే దౌర్భాగ్యంగా వుందని విమర్శించారు. నాలుగు వందల సినిమాలకు మాటలు రాసిన ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణను కూడా ఈ సమావేశంలో మాట్లాడనివ్వలేదని విమర్శించారు.
పరుచూరి గోపాలకృష్ణ కళ్ల వెంట నీరు పెట్టుకుని వెళ్లిపోవడం చూశానని, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఈ సమావేశంలో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని, ఒకరినొకరు అరుచుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ మధ్య జరిగిన ‘మా’ఎన్నికల్లో తాను గెలిచినందుకు ఆనందపడాలో, ఈ సమావేశానికి వచ్చినందుకు బాధపడాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ‘మా’ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు దాటిపోయిందని, ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా ఫీలవుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఈ పదవి అక్కర్లేదని రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.