Narendra Modi: టర్కీ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ
- ఐరాస సర్వ ప్రతినిధుల సమావేశంలో పాక్ కు మద్దతుగా మాట్లాడిన టర్కీ
- ఆర్టికల్ 370ని నిర్వీర్యం విషయాన్ని తప్పుబట్టిన టర్కీ అధ్యక్షుడు
- టర్కీతో 2.3 బిలియన్ డాలర్ల షిప్ యార్డ్ టెండర్ ను భారత్ రద్దు చేసే అవకాశం
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సమావేశంలో పాక్ కు మద్దతుగా టర్కీ మాట్లాడిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయంపై విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన విషయాన్ని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ తప్పుబట్టారు. భారత్ తీసుకున్నవి దూకుడు నిర్ణయాలని అన్నారు. దీంతో మోదీ ఆ దేశానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఐరాసలో టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే ఖండించింది. కాగా, గతేడాది ఒకాసా పర్యటన సందర్భంగా మోదీ టర్కీ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. టర్కీకి రావాలని ఆ సమయంలో మోదీని కోరారు. ఈ నేపథ్యంలోనే మోదీ టర్కీకి వెళ్లాలనుకున్నారు. మరోవైపు, టర్కీతో 2.3 బిలియన్ డాలర్ల షిప్ యార్డ్ టెండర్ ను కూడా భారత్ రద్దు చేసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది.