Abhijit Benerjee: మనసు మార్చుకున్న అభిజిత్ బెనర్జీ... మోదీ సంక్షేమ పథకాలపై ప్రశంసలు!
- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన అభిజిత్
- జన్ ధన్, ఆయుష్మాన్ భారత్ మంచి పథకాలు
- భారత భవిష్యత్ కు ఉపకరిస్తాయని వ్యాఖ్య
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందని, తిరిగి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యపడబోదని సంచలన వ్యాఖ్యలు చేసిన నోబెల్ ఆర్థిక బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ తన మనసును మార్చుకున్నారు. నరేంద్ర మోదీ ప్రారంభించిన పలు స్కీమ్ లను గురించి ప్రస్తావిస్తూ, తన అభిప్రాయాన్ని చెప్పారు. జన్ ధన్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలు, భారత్ భవిష్యత్ కు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఈ పథకాలన్నీ ఓ సదుద్దేశంతో ప్రారంభించినవేనని అన్నారు.
ఇండియాలో 50 లక్షల మందికి ఉచిత వైద్య చికిత్సను అందించే ఆయుష్మాన్ భారత్ తనకెంతో నచ్చిందని చెప్పారు. జన్ ధన్ యోజన పథకంతో ప్రజలు తమ సేవింగ్స్ ను మరింతగా పెంచుకునే వీలు లభించిందని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నా, పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక విధానాలు, అందుకు సంబంధించిన ఆలోచనల్లో ఇండియాపై తనకు ఎటువంటి పక్షపాతమూ లేదని ఆయన స్పష్టం చేశారు.