Chittoor District: చిత్తూరు జిల్లా పరువు హత్య కేసులో తల్లిదండ్రులే నిందితులు
- శాంతిపురం మండలం రెడ్లపల్లెలో గతవారం బాలిక హత్య
- దళిత యువకుడిని పెళ్లాడడంతో తట్టుకోలేక చంపేసిన తల్లిదండ్రులు
- విచారణలో అంగీకరించిన వైనం
చిత్తూరు జిల్లాలో జరిగిన బాలిక పరువు హత్య కేసులో ఆమె తల్లిదండ్రులే నిందితులని పోలీసులు తేల్చారు. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో తల్లిదండ్రులే ఆమెను పిలిచి హత్య చేశారు. అనంతరం కాల్చి బూడిద చేసినట్టు తేల్చిన పోలీసులు బాలిక తల్లిదండ్రులతోపాటు ఇందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. శాంతిపురం మండలంలోని రెడ్లపల్లెకి చెందిన చందన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సమీప గ్రామమైన మడిఒగ్గుకు చెందిన నందకుమార్‌ను ప్రేమించింది. యువకుడు దళితుడు కావడంతో వీరి పెళ్లికి చందన తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో గతవారం ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రేమికులు కుప్పం చేరుకుని గంగమ్మ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
విషయం తెలిసిన చందన తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాతి రోజే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులను నమ్మించారు. మృతదేహాన్ని దహనం చేశారు. అయితే, ఆమెను తల్లిదండ్రులే చంపేశారన్న నందకుమార్ బంధువుల ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందన తల్లిదండ్రులు, బంధువుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చందనను తామే హత్య చేశామని వారు అంగీకరించారు.