Amit Shah: జమ్మూకశ్మీర్ లో అధికరణ 370 పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ చెప్పగలదా?: అమిత్ షా సవాల్
- కాంగ్రెస్ హయాంలో ఎందుకు రద్దు చేయలేదన్న అమిత్ షా
- జవాన్ల మరణాలపై మన్మోహన్ ఎందుకు మాట్లాడరని వ్యాఖ్యలు
- మహారాష్ట్రలో గెలుపు మాదేనంటూ ధీమా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. జమ్మూకశ్మీర్ లో అధికరణ 370 రద్దును విమర్శిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి దాన్ని పునరుద్ధస్తామని చెప్పగలదా? అని సవాల్ విసిరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈరోజు నవపూర్ లో ప్రచార సభలో షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఖరిని ఖండించారు. మహారాష్ట్రలో గెలుపు తమదే అని తెలిపారు.
‘కాంగ్రెస్ హయాంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడుల్లో 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినా 370 అధికరణను రద్దు చేయలేదు. ఎన్నికలకు ఇక ఒక రోజే గడువుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కి సవాల్ చేస్తున్నా.. అధికారంలోకి వస్తే అధికరణ 370ను పునరుద్ధరిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా ? ఆ రాష్ట్రంలో సైనికుల మరణాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు మౌనం వీడలేదు?’ అని ప్రశ్నించారు.