Kannababu: బాణసంచా తయారీ, నిల్వకేంద్రాలపై నిఘాకు సీఎం జగన్ ఆదేశించారు: ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడి
- నిన్న వేమవరంలో అగ్నిప్రమాదం
- 9 మందికి గాయాలు
- ప్రమాదంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారన్న మంత్రి
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారని తెలిపారు. 20 రోజుల వ్యవధిలో 2 ప్రమాదాలు జరగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారని, నిబంధనలు పాటించని బాణసంచా కేంద్రాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారని తెలిపారు.
అనుమతులు ఇచ్చేముందు ఫైర్, పోలీసు శాఖ తనిఖీలు చేయాలని, బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై నిఘా ఉంచాలని కూడా సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు. వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవాలని సీఎం చెప్పారని వివరించారు.
బాణసంచా ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని కన్నబాబు చెప్పారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జి.వేమవరంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి 9 మందికి గాయాలయ్యాయి.