Revanth Reddy: హుజూర్ నగర్ లో నా అక్కను గెలిపించుకుంటాను: రేవంత్ రెడ్డి
- కేటీఆర్ తన చెల్లి కవితను గెలిపించుకోలేకపోయారు
- కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్ట
- కోర్టులతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవు
టీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన చెల్లి కవితను గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మావతి రెడ్డిని అక్క అంటూ సంబోధించిన ఆయన.. ఆ నియోజక వర్గంలో అక్కను గెలిపించుకుంటానని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో కార్మికులకు మద్దతు తెలిపిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్టలా ఉందని విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ లైట్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ న్యాయస్థానాలతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవని అన్నారు.
తెలంగాణ ఉద్యమ నేతలు ఎవరూ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడడం లేదని, దీన్ని బట్టి టీఆర్ఎస్ లో చీలిక వచ్చినట్లు అర్థమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే హక్కు కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై రూ.2.5 లక్షల అప్పుల భారం పడిందన్నారు.