Telangana: తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. కోదండరాం, ఎల్.రమణ, రావుల, మోత్కుపల్లి అరెస్ట్
- ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
- ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
- మోత్కుపల్లి, ఎల్.రమణ, రావులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ జోరుగా సాగుతోంది. కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. బస్సులు రోడ్డుపైకి రాకుండా డిపోల వద్ద కార్మికులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు కూడా భయపడి విధులకు దూరమయ్యారు.
బంద్‌కు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు ప్రకటించారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న బంద్‌లో పాల్గొనేందుకు పార్టీ నేతలతో కలిసి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.