Tamil Nadu: అచ్చం ‘జాలీ’ కథే... ఆహారంలో సైనేడ్ కలిపి ముగ్గురి హత్య: తమిళనాడులో ఓ మహిళ ఘాతుకం
- ఆస్తి కోసం ఇద్దరు, ఆగ్రహంతో మరొకరిపై దారుణం
- వియ్యపురాలు, తమ్ముడు, మరదలిని చంపిన కన్నామ్మాల్
- దిండుక్కల్ జిల్లా తిరుప్పూర్‌లో ఘటన
కేరళ రాష్ట్రం కోజీకోడ్‌లో ఆస్తి కోసం అత్తమామలు, భర్త, రెండో భర్త భార్య, వారి కూతురు ఇలా ఆరుగురు కుటుంబ సభ్యులను ఆహారంలో సైనేడ్ కలిపి హత్య చేసిన జాలీ కథ తెలిసిందేగా? అచ్చం అలాగే... ఆస్తి కోసం స్వయానా సోదరుడు, అతని భార్యని, ఆగ్రహంతో వియ్యపురాలిని హత్య చేసింది తమిళనాడులో ఓ మహిళ. అనంతరం మృతదేహాలను ఇంటి వెనుక పాతిపెట్టేసింది.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా తిరుప్పూర్‌కు చెందిన కన్నామ్మాల్, ఈచ్చనత్తం సమీపంలోని దాసనాయక్కనూర్‌కు చెందిన సెల్వరాజ్ అక్కాతమ్ముడు. వీరి మధ్య కొన్నాళ్లుగా ఆస్తి తగాదా జరుగుతోంది. ఫైనాన్సియర్ అయిన సెల్వరాజ్ మధురైలోని ఆరప్పాలయంలో ఉంటున్నాడు.
కొడుకు వివాహం నిశ్చయం కావడంతో ఇటీవల సెల్వరాజ్, భార్య వసంతమణితో కలిసి అక్క కన్నామ్మాల్ ఇంటికి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చాడు. ఇదే అదనుగా భావించిన కన్నామ్మాల్ ఆహారంలో సైనేడ్ కలిపి తమ్ముడు, మరదల్ని హత్య చేసింది. అనంతరం తన అల్లుడు నాగేంద్రన్, ఇళంగో అనే వ్యక్తి సాయంతో వారి మృతదేహాలను ఇంటి వెనుక గుంత తవ్వి పూడ్చిపెట్టింది. ఈ కేసులో పోలీసులు కన్నామ్మాల్‌తోపాటు ఆమెకు సహకరించిన నాగేంద్రన్, ఇళంగోలను అరెస్టు చేశారు.
ఇదిలావుంటే, నాగేంద్రన్ తల్లి రాజమణి (60) గత మే నెలలో కన్నామ్మాల్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. తాజాగా కన్నామ్మాల్ హత్యోదంతం బయటపడడంతో బెంగళూరులో ఉంటున్న నాగేంద్రన్ సోదరి నాగేశ్వరి తన తల్లి కనిపించక పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్మామ్మాల్ ఇంటికి వెళ్లాకే తన తల్లి కనిపించకుండా పోయిందని, ఆమెను కూడా కన్నామ్మాలే హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది.
దీంతో కన్నామ్మాల్‌ను విచారించిన పోలీసులకు ఆమె విస్తుపోయే నిజం చెప్పింది. తన కుమార్తె పూంగుడితో ఆమె అత్త రాజమణి (60) తరచూ గొడవ పడుతూ వేధిస్తోందని, దీన్ని భరించలేక ఆమెను కూడా చంపేశానని తెలపడంతో పోలీసులు కంగుతిన్నారు.
రాజమణిని హత్య చేసిన సమయంలో తన కుమార్తె పూంగుడి కూడా సాయపడిందని, రాజమణి మృతదేహాన్ని కూడా ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లు తెలిపింది. మూడు మృతదేహాలను వెలికితీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వాటిని ఆసుపత్రికి తరలించారు. అలాగే రాజమణి హత్య కేసులో కన్నామ్మాల్ కుమార్తె పూంగుడిని కూడా అరెస్టు చేశారు.