chilakaluripeta: చిలకలూరిపేట బస్సు దహనం కేసు.. తండ్రికి పెరోల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన చలపతిరావు కుమార్తె

  • 1993లోె ప్రయాణికులతో వెళ్తున్న బస్సును తగలబెట్టిన దుండగులు
  • రాష్ట్రపతి క్షమాభిక్షతో జీవిత ఖైదు అనుభవిస్తున్న చలపతిరావు
  • పెరోల్ ఇవ్వడం కుదరదన్న ప్రభుత్వం తరపు న్యాయవాది

తన తండ్రిని పెరోల్‌పై విడుదల చేయాలంటూ చిలకలూరిపేట బస్సు దహనం కేసులో శిక్ష అనుభవిస్తున్న చలపతిరావు కుమార్తె హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు చలపతిరావు మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ రాష్ట్రపతి ప్రసాదించిన క్షమాభిక్ష ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

మార్చి 8, 1993న హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమయ్యారు. ఈ కేసులో చలపతిరావు, విజయవర్ధనంలకు గుంటూరు మూడో అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మరణశిక్షను సమర్థించాయి. అయితే, ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా జీవితఖైదుగా మారింది. అప్పటి నుంచి జైలులోనే ఉన్న చలపతిరావును పెరోల్‌పై విడుదల చేయాలంటూ తాజాగా ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించింది.

పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ రెండేళ్లకోసారి ఇచ్చే శిక్షా విరామం (పెరోల్)ను ఇప్పటి వరకు చలపతిరావుకు ఇవ్వలేదని, ఇకనైనా ప్రసాదించాలని కోరారు. ఆయన వాదనలను ప్రభుత్వం తరపు న్యాయవాది తోసిపుచ్చారు. రాష్ట్రపతి ఆయనకు క్షమాభిక్ష పెట్టినందున పెరోల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం.. రాష్ట్రపతి క్షమాభిక్ష ఉత్తర్వులను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

chilakaluripeta
Bus
perol
Andhra Pradesh
High Court
  • Loading...

More Telugu News