netflix: అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వీడియోలకూ ‘కత్తెర’.. ప్రభుత్వ నిర్ణయం
- ఇకపై వెబ్ సిరీస్ వీడియోలకూ సెన్సార్
- స్వీయనియంత్రణ పాటించని సంస్థలు
- అసభ్యకరంగా, రెచ్చగొట్టేవిగా ఉండడమే కారణం
ఓవర్ టు ది టాప్ (ఓటీటీ) సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు ఇది చేదు వార్తే. ఈ సంస్థల నుంచి వస్తున్న వెబ్‌సిరీస్ వీడియోలు మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేవిలా, అసభ్యకరంగా ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆ వైపుగా దృష్టిసారించింది. టీవీ, సినిమాలతో పాటు ఓటీటీ ద్వారా ప్రసారమవుతున్న వీడియోలకు కూడా సెన్సార్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నిజానికి ఓటీటీ కంటెంట్ విషయంలో ఎవరికి వారే స్వీయ నియంత్రణ విధించుకోవాలని ఈ ఏడాది మొదట్లోనే ప్రభుత్వం కోరింది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఇందుకు సరిపోతాయని అభిప్రాయపడిన సంస్థలు ప్రభుత్వ సూచనను బేఖాతరు చేసినట్టు అధికారి తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన మొదటి వెబ్‌సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని గతేడాది కొందరు కోర్టుకెక్కినా వారి అభ్యంతరాలను కోర్టు కొట్టివేసింది.
మరో సిరీస్‌లో హిందువులను కించపర్చే సన్నివేశాలున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సరైన మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు వెబ్‌సిరీస్ వీడియోలనూ సెన్సార్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రసార, ఐటీ మంత్రిత్వశాఖతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.