KCR: కేసీఆర్ దిగిరాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తాం: తమ్మినేని
- రేపటి బంద్ లో తెలంగాణ సమాజమంతా పాల్గొనాలి
- రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని ప్రభుత్వం అనడం దారుణం
తాము తలపెట్టిన సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు ఈ బంద్ ను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపి మాట్లాడారు. రేపటి బంద్ లో తెలంగాణ సమాజమంతా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
రేపటి బంద్ తో నైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ దిగిరాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని ప్రభుత్వం అనడం దారుణమని విమర్శించారు. కాగా, ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వరంగల్ లో సీపీఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఏకశిలా పార్కు వరకు ర్యాలీ కొనసాగింది. ఇతర జిల్లాల్లోనూ వామపక్ష పార్టీలు కార్మికులతో కలిసి నిరసన తెలుపుతున్నాయి.