TSRTC: రేపు తెలంగాణ బంద్... కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
- 14వ రోజుకు చేరిన బంద్
- రేపు సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ సంఘాలు
- సమ్మెకు సహకరించాలని ప్రజలను కోరిన విపక్షాలు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్, నేటికి 14వ రోజుకు చేరుకోగా, రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునివ్వడం, అదే సమయంలో క్యాబ్ డ్రైవర్లు సైతం శనివారం నుంచి సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించడంతో, ప్రయాణికులు, ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రతరమైంది. ఇక హైకోర్టులో సమ్మెపై నేడు కూడా కీలక వాదనలు జరుగనుండగా, ఇప్పటికే పంతాలకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ సూచించిన హైకోర్టు, నేడు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఈ బంద్ కు రాష్ట్ర ప్రజలు, ఇతర ఉద్యోగ సంఘాలు సహకరించాలని విపక్ష పార్టీల నేతలు కోరారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు పలకాలని కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు సామాన్య ప్రజలు కూడా కలిసి రావాలన్నారు. మరోవైపు రేపటి బంద్ కు సంఘీభావంగా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.