Chandrababu: ఐదు నెలల్లోనే ఇన్ని అరాచకాలా?: జగన్ పై చంద్రబాబు నిప్పులు
- ఎందుకు ఓటేశామా? అని ప్రజలు మధనపడుతున్నారు
- వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలా?
- క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన వారికే తొలి ర్యాంకులా?
- మండిపడ్డ మాజీ సీఎం చంద్రబాబు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గద్దెనెక్కి, ఐదు నెలలైనా గడవకుండానే లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేశారని, ప్రజలు వారికి ఇప్పుడు ఎందుకు ఓటేశామా? అని మధన పడుతున్నారని మాజీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. వర్షాకాలంలో విద్యుత్ కోతలు కనిపిస్తున్నాయని, మద్యంపై జే-ట్యాక్స్ విధిస్తున్నారని మండిపడ్డారు.
సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన వారికే మొదటి ర్యాంక్ వచ్చిందని, ప్రభుత్వ అక్రమాలపై ఇంతకన్నా రుజువేం కావాలని ప్రశ్నించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరీక్షలు రాయవద్దని తాను చెప్పడం లేదని, కానీ, వారికే మొదటి ర్యాంక్ రావడం వెనుక ఎంత కుట్ర దాగుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం మీడియాను నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తోందని, ముఖ్యంగా ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపే పత్రికలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. మీడియాలో రాసే వార్తల ఆధారంగా పరువు నష్టం దావా కేసులు వేయాలని సమాచార శాఖను ఆదేశిస్తూ, జీవోలు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదే తరహా జీవోను గతంలో ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి, తన తప్పును గంటల్లోనే తెలుసుకుని విజ్ఞతను చూపుతూ దాన్ని వెనక్కు తీసుకున్నారని, ఇప్పుడు జగన్, అదే జీవోకు మరింత పదును పెట్టి, సోషల్ మీడియాను కూడా కలుపుతూ జీవోను తెచ్చారని అన్నారు.
కాగా, తన మీడియా సమావేశానికి ముందు చంద్రబాబు కొన్ని వీడియోలను ప్రదర్శించారు. వైఎస్ హయాంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ, జీవో జారీ చేసి, ఉపసంహరించుకున్న వీడియోను, అంతకుముందు నాడు అసెంబ్లీలో వైఎస్ మాట్లాడిన మాటలను, ఓ విలేకరిని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరిస్తున్న ఆడియోను ప్రదర్శించారు.