smart phone: ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే నీలిరంగు కాంతితో దుష్ప్రభావం
- మానవ కణజాలంతో పోలి ఉండే తుమ్మెదలపై పరిశోధన
- బ్లూ లైట్‌తో వయసు మీరిన లక్షణాలు
- మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే, వీటి తెరల నుంచి వెలువడే నీలిరంగు కాంతి (బ్లూ లైట్)తో దుష్ప్రభావం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వయసు మీరిన లక్షణాలు వస్తాయని, మెదడు కణజాలం దెబ్బతింటుందని ఒరెగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
మానవ కణజాలంతో పోలి ఉండే తుమ్మెదలపై నిర్వహించిన పరిశోధనల ఫలితంగా వారు ఈ వివరాలు వెల్లడించారు. కృత్రిమ వెలుగు వాటి జీవిత కాలాన్ని తగ్గించినట్లు తేల్చారు. బ్లూ లైట్ నేరుగా కళ్లలోకి పడకపోయినా సరే, దానికి ఎక్స్‌పోజ్ అయినా కూడా ఈ దుష్ప్రభావాలు పడతాయని తెలిపారు.
ఎల్‌ఈడీ తరంగాలకు గురైతే మెదడు కణజాలం దెబ్బతింటుందని చెప్పారు. మానవులకు, జంతుజాలానికి సహజ కాంతి చాలా ముఖ్యమని వివరించారు. అది జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ వెలుగు మెదడు చురుకుదనంగా ఉండడానికి, హార్మోన్‌ల ఉత్పత్తితో పాటు కణజాల పునరుద్ధరణను చక్కగా క్రమబద్ధీకరిస్తుందని తెలిపారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వినియోగించేటప్పుడు సరైన లెన్స్‌లతో ఉండే కళ్లజోడు ధరిస్తే మంచిదని సూచించారు.