saiber crime: రెట్టింపు ఆశ చూపి లక్షల్లో దోచేశారు: 'గూగుల్‌ పే' పేరుతో సైబర్‌ మోసం

  • రూపాయికి రెండు రూపాయలంటూ ఫోన్‌
  • చిన్న మొత్తాలు వేయగానే వెంటనే రెట్టింపు డబ్బు జమ 
  • పెద్ద మొత్తం వేయగానే అంతా హాంఫట్‌

‘క్షణాల్లో మీ డబ్బు రెట్టింపు’ అంటూ వల విసిరారు. చిన్నమొత్తాలు జమ చేయగానే వెనువెంటనే రెట్టింపు డబ్బు ఖాతాలో జమ చేసేవారు. అత్యాశకు పోయి భారీ మొత్తం జమ చేశారో? అంతే.. హాంఫట్‌. ఇదీ సైబర్‌ నేరగాళ్ల నయామోసం. ఇందుకోసం ఏకంగా ‘గూగుల్‌ పే ఆఫర్లు’ అంటూ ఫోన్‌ చేసి మరీ దోచుకున్నారు. నిజమేననుకున్న వారు వీరి వలకు చిక్కి లక్షల్లో నష్టపోయి లబోదిబోమంటున్నారు.

హైదరాబాద్ సైబర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఢిల్లీ, నోయిడా కేంద్రంగా తిష్టవేసిన కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇటీవల ఓ కొత్త ప్రకటనకు తెరతీశారు. ‘గూగుల్‌ పే పండగ ఆఫర్‌...మీరు రూపాయి జమ చేస్తే రెండు రూపాయలు మీ వ్యాలెట్‌లోకి వస్తాయి’...అంటూ ఫోన్లు చేస్తున్నారు. అంతే, ఎందుకు అలా ఇస్తారు? ఎలా ఇవ్వగరు? అన్నది ఆలోచించకుండా పలువురు డబ్బు జమ చేయడం ప్రారంభించారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మమత అనే మహిళకు ఇలాగే ఫోన్‌ వచ్చింది. ఆశపడిన ఆమె ట్రైల్‌గా రూ.10లు జమ చేసింది. వెంటనే ఆమె వ్యాలెట్‌కు రూ.20లు జమయ్యాయి. అంతే, ఇది నిజమేననుకున్న ఆమె ఏకంగా లక్షా 10 వేల రూపాయలు జమ చేసింది. తిరిగి డబ్బు రాలేదు. ఆందోళనతో ఆమె ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. మోసపోయానని గుర్తించిన ఆమె లబోదిబోమంటూ సైబర్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగు చూసింది.

ఈ విధంగా కేటుగాళ్లు దక్షిణ భారత దేశం నుంచి రోజుకి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు కాజేసినట్లు సమాచారం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, వైజాగ్‌, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, కర్నూల్‌ ప్రాంతాల్లోని పలువురి నుంచి నేరగాళ్లు కోట్లమేర కాజేసినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోనే రోజుకి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బాధితులు పోగొట్టుకుంటున్నారని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌ని నమ్మవద్దని సూచించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News