Spice Jet: స్పైస్ జెట్ విమానాన్ని చుట్టుముట్టిన పాక్ యుద్ధ విమానాలు... హడలిపోయిన ప్రయాణికులు!
- ఢిల్లీ నుంచి కాబూల్ వెళుతున్న విమానం
- భారత యుద్ధ విమానంగా పొరబడిన పాక్ వాయుసేన
- వెంటనే గాల్లోకి లేచిన ఎఫ్-16 ఫైటర్లు
- స్పైస్ జెట్ విమాన పైలెట్ తో సంభాషణ
ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ వెళుతున్న స్పైస్ జెట్ విమానాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు గాల్లోనే నిలువరించిన ఘటన వెలుగుచూసింది. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్ ఇటీవలే తెరిచింది. ఈ క్రమంలో స్పైస్ జెట్ విమానం ప్రయాణిస్తుండగా దాన్ని భారత యుద్ధ విమానంగా పొరబడిన పాక్ వాయుసేన వెంటనే స్పందించింది. పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఆ స్పైస్ జెట్ విమానాన్ని చుట్టుముట్టాయి.
ఎత్తు తగ్గించాల్సిందిగా స్పైస్ జెట్ పైలెట్ కు ఓ పాక్ ఫైటర్ పైలెట్ చేతితో సంజ్ఞలు చేసినట్టు విమాన ప్రయాణికులు తెలిపారు. ఆపై పైలెట్ తో రేడియో ద్వారా సంభాషించి అది ప్రయాణికుల విమానం అని పాక్ పైలెట్లు తెలుసుకున్నారు. ఆ విమానం పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన తర్వాతే పాక్ ఎఫ్-16లు వెనుదిరిగాయి. ఉన్నట్టుండి గాల్లో యుద్ధ విమానాలు రౌండప్ చేయడంతో స్పైస్ జెట్ ప్రయాణికులు భీతావహులైనట్టు సమాచారం.
కాగా, విమానం కాబూల్ చేరిన తర్వాత పాక్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం స్పైస్ జెట్ విమానం ఢిల్లీకి ఐదు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాస్తవానికి ప్రతి విమానంపైనా అది ఏ తరహా విమానమో కోడ్ భాషలో రాసి ఉంటుంది. దీన్ని పాక్ వాయుసేన అర్థం చేసుకోవడంలో పొరబడిన కారణంగానే గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.