KCR: జగన్ కు ఉన్న సోయి కేసీఆర్ కు లేదు: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ
- కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వర్ రావులు దోచుకుంటున్నారు
- కార్మికులు సమ్మెను తీవ్రం చేసి డిమాండ్లను నెరవేర్చుకోవాలి
- మాకు గడీల రాజ్యం కాదు ప్రజల రాజ్యం కావాలి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చినప్పటికి ముఖ్యమంతి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ విమర్శించారు. సమ్మె 13వ రోజుకు చేరిందని ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గిగా మారుతారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులకు శోభ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వర్ రావులు తెలంగాణను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మెను తీవ్రం చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని శోభ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... జగన్ కు ఉన్న సోయి కేసీఆర్ కు లేదని ఎత్తిపొడిచారు.
‘మాకు గడీల రాజ్యం కాదు ప్రజల రాజ్యం కావాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాల విషయంలో హైకోర్టు కేసీఆర్ ను మందలించినా సోయి రావడం లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులంతా కలిసి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని ఆమె పిలుపు ఇచ్చారు. కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.