rajnath singh: రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాయాలి రాహుల్ జీ?: రాజ్ నాథ్
- విజయ దశమి రోజున ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయం
- రాఫెల్ యుద్ధ విమానంపై ఓం రాశాను
- అలా ఎందుకు రాశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు
రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. హర్యానాలోని భవానీలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... విజయ దశమి రోజున ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయమని అన్నారు. తాను రాఫెల్ యుద్ధ విమానంపై ఓం అని రాశానని, అయితే, అలా ఎందుకు రాశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
'నేను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ రోజు శస్త్ర పూజలో రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాసి ఉండాల్సింది?' అని ప్రశ్నించారు. ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్.. తొలి రాఫెల్ విమానాన్ని అందుకుని, దానికి శస్త్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. ఇటీవల 'డ్రామా' అంటూ విమర్శించారు.
'ఇటువంటి మూఢనమ్మకాలు తొలగిపోయినప్పుడే భారత్ సొంతంగా రాఫెల్ వంటి యుద్ధ విమానాలను తయారు చేసుకోగలదు' అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు ఈ నెల 24న వెల్లడవుతాయి.