nageshwar: అలాగైతే ఆర్టీసీ నిండా మునిగిపోతుంది: ప్రొఫెసర్ నాగేశ్వర్
- ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది
- మూడు వేల అద్దె బస్సులు పెంచితే మరింత నష్టం
- కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం
కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ తెలంగాణ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు మద్దతుగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వామపక్షాలు ఈ రోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. వారికి నాగేశ్వర్ మద్దతు తెలిపి మాట్లాడారు.
అద్దె బస్సులు పెంచుతున్న తీరును నాగేశ్వర్ తప్పుబట్టారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, మూడు వేల అద్దె బస్సులు పెంచితే నిండా మునిగిపోతుందని చెప్పారు. ఏటా ఆ సంస్థకు వస్తున్న నష్టాలు రూ.720 కోట్లని వివరించారు.
కార్మికులు సమ్మె చేస్తోంది వేతనాల కోసం కాదని నాగేశ్వర్ అన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీ పట్టణ రవాణాల్లోనే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. బస్సులకు లాభాలు వచ్చే మార్గాల్లో ప్రైవేటు బస్సులు అధికంగా నడుస్తున్నాయని నాగేశ్వర్ తెలిపారు. మరోవైపు నష్టాలు వచ్చే మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని వివరించారు.