Australia: తప్పిపోయి.. నీరసించిపోయిన ఆమెను కాపాడిన 'ఎస్ఓఎస్' మెసేజ్!

  • తోటివారితో క్యాంప్ కు వెళ్లి మిస్సింగ్
  • మట్టిలో ఎస్ఓఎస్ అని రాసి బయటపడ్డ మహిళ
  • ఆస్ట్రేలియాలో ఘటన

ప్రమాదంలో ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో మనం వ్యవహరించే తీరే మన ప్రాణాలను కాపాడుతుంది. కొత్త ప్రదేశాన్ని చూడడానికి కొందరితో కలిసి వెళ్లిన ఓ మహిళ మనుషులెవరూ లేని అటవీ ప్రాంత సమీపంలో తప్పిపోయింది. ఆ సమయంలో వచ్చిన ఐడియా ఆమె ప్రాణాలను కాపాడింది. మూడు రోజులుగా తిండి లేకుండా, ఒంటరిగా, సమాజానికి దూరంగా గడిపిన ఆమె ఎట్టకేలకు అక్కడి నుంచి బయట పడింది.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఆస్ట్రేలియాలో అటవీ ప్రాంతానికి దగ్గరలోని ప్రదేశాలను చూడడానికి వెళ్లిన దెబోరా (55) అనే మహిళ తప్పిపోయింది. నీళ్లు తప్ప మరేమీ ఆమెకు అందుబాటులో లేవు. అక్కడి నుంచి ఎలా బయట పడాలో ఆమెకు తెలియట్లేదు. పూర్తిగా నీరసించిపోయే స్థితికి చేరుకుంటోంది. ఆ సమయంలో ఆమెకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే మట్టిలో పెద్ద అక్షరాలతో ఆంగ్లంలో 'ఎస్ఓఎస్' అని రాసింది. తాము ప్రమాదంలో ఉన్న విషయాన్ని తెలుపుతూ, వెంటనే సాయం చేయాలన్న దానికి సూచికగా ఎస్ఓఎస్ (సేవ్ అవర్ సోల్స్) అని రాస్తారు.
 
ఆమె ఎస్ఓఎస్ రాసిన ప్రదేశంలోని భూభాగ యజమాని నీల్ మ్యార్రియట్... ఆ స్థలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. తన నివాసం వద్ద నుంచి ఆయన వీడియో కెమెరా ద్వారా ఆ ప్రదేశాన్ని చూశారు. దీంతో అక్కడ ఈ అక్షరాలు రాసి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

దెబోరా ఆ ప్రాంతంలో తప్పిపోయిన విషయాన్ని ఆమెతో క్యాంప్ కు వచ్చిన ఇతర వ్యక్తులు కూడా పోలీసులకు తెలిపారు. దీంతో రెండు రోజులుగా ఆమె గురించి గాలింపు జరుగుతోంది. ఈ విషయాన్నే తెలుసుకున్న నీల్.. తన కెమెరా సాయంతో ఆమెను గుర్తించాడని పోలీసులు వివరించారు.

ఇంతకు ముందురోజు అక్కడ ఎస్ఓఎస్ అనే మెసేజ్ ఏమీ లేదని నీల్ మీడియాకు తెలిపారు. ఆ అక్షరాలను చూసి, ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించానని చెప్పారు. ఆయన ఇటీవలే ఆ ప్రాంతంలో ఈ సీసీటీవీ కెమెరాలను పెట్టించానని తెలిపారు. సాంకేతికతతో దెబోరా ఎక్కడ ఉందో తెలుసుకోవడం గొప్ప విషయమని పోలీసులు అన్నారు.

  • Loading...

More Telugu News