SBI card: కార్డుతో పనిలేదు...రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ చాలు: ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్
- కస్టమర్ల కోసం ‘ఎస్‌బీఐ కార్డ్ పే’ సౌలభ్యం
- మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు
- కార్డు, పిన్‌తో పనిలేకుండా లావాదేవీలు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ అనుబంధ 'ఎస్‌బీఐ కార్డ్' తన ఖాతాదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. చెల్లింపుల సమయంలో కార్డు మర్చిపోయాననో, పిన్ గుర్తుకు రావడం లేదనో బాధపడే వారికి ఇది శుభవార్త. ఇకపై కార్డు, పిన్‌తో పనిలేకుండా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా ‘ఎస్‌బీఐ కార్డ్ పే’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే. ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే చాలు.
ఆ తర్వాత షాపింగ్ మాల్, పెట్రోల్ బంక్...ఇలా ఎక్కడికి వెళ్లినా డబ్బు చెల్లించాల్సి వస్తే అక్కడి ‘పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్’ వద్ద మొబైల్ ఫోన్ ఆధారంగా డబ్బు జమ చేయవచ్చు. అయితే ఈ సదుపాయం ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్ క్యాట్ వెర్షన్ 4.4, అంతకు మించి ఓఎస్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో మాత్రమే పొందే వీలుంటుంది.
ఒక్కో లావాదేవీలో, రోజు వారీ లావాదేవీలో ఎంత ఖర్చు చేయాలన్న విషయం ఖాతాదారుడే నిర్ణయించుకోవచ్చని, ఈ విధానం కోసం పూర్తి సురక్షితమైన హోస్ట్ కార్డ్ ఎమ్యూలేషన్ సాంకేతికత(హెచ్‌సీఈ)ను ఉపయోగించినట్టు ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ హర్‌దయాళ్ ప్రసాద్ తెలిపారు.