Andhra Pradesh: విడతల ముఖ్యమంత్రి గారూ! మీరు అన్న మాట ఓసారి చూడండి: జగన్ పై లోకేశ్ ఫైర్
- 85 లక్షల మంది రైతులకు రూ.12,500 ఇస్తామన్నారు
- ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే ‘రైతు భరోసా’నా?
- మిగిలిన రైతులకు కనీస సాయం అందకుండా చేశారు!
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన జగన్ నిలబెట్టుకోలేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘విడతల ముఖ్యమంత్రి గారూ!’ అంటూ ఓ ట్వీట్ చేసిన లోకేశ్, రైతులకు కనీససాయం కూడా ‘రాలిపోయిన రత్నమేగా!’ అంటూ ధ్వజమెత్తారు. 85 లక్షల మంది రైతులకు రూ.12,500 ఇస్తామని నాడు చెప్పిన మాటను మళ్లీ ఓసారి గుర్తుచేసుకోవాలని జగన్ కు సూచించారు.
ఈ సందర్భంగా నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన ప్రసంగ వీడియోను పోస్ట్ చేశారు. ‘విడతల ముఖ్యమంత్రిగారూ!’ ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్లు ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే ‘రైతు భరోసా’ అని, ఇచ్చేది కేవలం రూ.7500 అని చెబుతున్నారని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతులకు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారని, ఇప్పుడు 45 లక్షల మంది రైతులకు కనీస సాయం కూడా అందకుండా చేశారని ధ్వజమెత్తారు.