Uttam Kumar Reddy: రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ మద్దతు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- 50 వేల మంది కార్మికులను సీఎం కేసీఆర్ రోడ్డున పడేశారు
- హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి
- ఉప ఎన్నికలో కాంగ్రెస్ కే కార్మికులు మద్దతు ఇవ్వాలి
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ టీఎస్ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. కోదాడలో ఆర్టీసీ కార్మికులతో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నిక జరుగుతున్న హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఈ ఉప ఎన్నికలో తమ పార్టీకే మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా, పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. సమ్మె, భవిష్యత్ కార్యాచరణలపై చర్చిస్తున్నారు.