Crime News: ప్రేమోన్మాది ఘాతుకం: బస్టాప్‌లో యువతిపై కత్తితో దాడి.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

  • కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం వేచి ఉండగా  హత్యా యత్నం
  • కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలు
  • అనంతరం ఆత్మహత్యా యత్నం చేసిన నిందితుడు

తనను ప్రేమించలేదన్న కోపంతో నిండుప్రాణాన్ని బలికోరాడు ఓ ప్రేమోన్మాది. కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం బస్టాప్‌లో వేచివున్న యువతిపై కత్తితో దాడిచేసి  హత్యా యత్నం చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన సుధాకర్‌ గత కొంతకాలంగా ఈ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. వాస్తవానికి అప్పటికే అతనికి పెళ్లయింది. భార్యతో విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.

అయినా ప్రేమ పేరుతో ఈ యువతిని వేధిస్తున్నాడు. కానీ ఆమె సుధాకర్‌ను ప్రేమించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన సుధాకర్ ఆమెను చంపాలనుకున్నాడు. ఈరోజు ఉదయం సదరు యువతి కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుండడం గమనించాడు. కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై  ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

అనంతరం తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Crime News
West Godavari District
podurumandal
kavitam village
lover ride
student murder
  • Loading...

More Telugu News