Parakala Prabhakar: భర్త విమర్శలపై స్పందించిన నిర్మలా సీతారామన్

  • దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందన్న పరకాల ప్రభాకర్
  • పీవీ - మన్మోహన్ ల ఎకనామిక్ మోడల్ ను అనుసరించాలంటూ సూచన
  • ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను చేపట్టిందన్న నిర్మల

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఆర్థికనిపుణుడు పరకాల ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయని... కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నో రంగాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని పబ్లిక్ డొమైన్ డేటా చెబుతోందని అన్నారు.

అయితే ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోని మేధావులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. మన ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే... పీవీ నరసింహారావు-మన్మోహన్ సింగ్ ల ఎకనామిక్ మోడల్ ను అనుసరించాలని సూచించారు. 'ది హిందూ' పత్రికకు రాసిన ఓ ఆర్టికల్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, తన భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్థాగత సంస్కరణలను చేపట్టిందని ఆమె తెలిపారు. జీఎస్టీ, వంట గ్యాస్, ఆధార్ తదితర అంశాలకు సంబంధించి తాము ఎన్నో చేశామని... ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేవే అని చెప్పారు.

జీఎస్టీని కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదని గుర్తు చేశారు. ఉజ్వల పథకంతో 8 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని అన్నారు. పన్నులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పారు. అక్టోబర్ 1 తర్వాత స్టార్టప్ కంపెనీలు తక్కువ పన్నులు మాత్రమే కట్టేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ ప్రశంసించదగ్గవేనని చెప్పారు.

Parakala Prabhakar
Nirmala Seetharaman
Indian Economy
NDA
BJP
PV Narasimha Rao
Manmohan Singh
  • Loading...

More Telugu News