IMF: 2019లో భారత్ వృద్ధిరేటు 6.1 శాతం !.. ఐఎంఎఫ్ ముందస్తు అంచనా
- ఏప్రిల్ అంచనాలతో పోలిస్తే 1.2 శాతం తగ్గే అవకాశం
- ఆటోమొబైల్, స్థిరాస్తి రంగాల్లో నెలకొన్న అనిశ్చితే కారణం
- 2020లో 7 శాతం నమోదుకు అవకాశం
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2019 సంవత్సరానికి గాను జీడీపీ అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ లో ప్రకటించిన 7.3 శాతం కంటే ఇది 1.2 శాతం తక్కువ. గత మూడు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో తాజా అంచనాల్లో వృద్ధిరేటును తగ్గించినట్లు తెలిపింది. 2018లో వాస్తవ వృద్ధిరేటు 6.8 శాతం ఉండగా, ఈ ఏడాది వృద్ధిరేటును 6.1గా ఉంటుందని ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదికలో తెలిపింది.
అయితే.. 2020లో భారత్ పుంజుకుని 7.0 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని పేర్కొంది. మరోవైపు దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఆదివారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన తాజా వివరాల్లో 2018లో భారత్ నమోదు చేసిన వృద్ధిరేటు 6.9 శాతంతో పోలిస్తే, 2019లో 6 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ద్రవ్యవిధానం సరళీకరణ, కార్పొరేట్ ఇన్ కమ్ టాక్స్ రేట్లలో సడలింపు, కార్పొరేట్, పర్యావరణ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల వినియోగాన్ని పెంచే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వృద్ధిరేటును పెంచడానికి తోడ్పడతాయని ఐఎంఎఫ్ తన నివేదికలో వెల్లడించింది.
మరోవైపు చైనా జీడీపీ కూడా 2019లో 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గత ఏడాదిలో ఇది 6.6 శాతంగా ఉంది. 2020లో చైనా జీడీపీ 5.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో ఆటోమొబైల్ రంగం, స్థిరాస్తి రంగాలు, బ్యాంకింగ్ యేతర కంపెనీల్లో నెలకొన్న అనిశ్చితి, భారత్ లో వృద్ధిరేటు తగ్గడానికి కారణం అవుతున్నాయని ఐఎంఎఫ్ వెల్లడించింది.