Northeast Monsoon: 17న రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాల రాక.. 16, 17 తేదీల్లో భారీ వర్షాలు
- రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాలు
- మరో రెండు రోజుల్లో పూర్తిగా వెనక్కి
- ఉత్తర భారతదేశం నుంచి తేమ గాలులు
ఓ వైపు నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తుండగానే, మరోవైపు నుంచి ఈశాన్య రుతుపవనాలు తెలంగాణలోకి అడగుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 17న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు భారతదేశం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కాగా, ఉత్తర భారతదేశం నుంచి నిర్మల్ రామగుండం వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని, మరో రెండు రోజుల్లో ఇవి పూర్తిగా వెనక్కి వెళతాయని అధికారులు వివరించారు. వీటితో సంబంధం లేకుండానే ఈశాన్య రుతుపవనాలు వస్తున్నట్టు తెలిపారు.