kanimozhi: కనిమొళిపై పిటిషన్ ఉపసంహరణ.. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి హైకోర్టు అనుమతి!
- సార్వత్రిక ఎన్నకల్లో కనిమొళిపై ఓడిన తమిళిసై
- కనిమొళి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ మద్రాస్ హైకోర్టుకు
- పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానంటూ కోర్టుకు అభ్యర్థన
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. డీఎంకే ఎంపీ కనిమొళిపై వివిధ ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు మద్రాసు హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనిమొళిపై పోటీ చేసిన తమిళిసై పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల అఫిడవిట్‌లో కనిమొళి సరైన వివరాలు పేర్కొనలేదని, ఆమె భర్త అరవిందన్ ఎన్నారై అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, అరవిందన్‌కు పాన్‌కార్డు లేదని, ఆమె కుమారుడు ఆదిత్యన్ విదేశీ పౌరుడని, అతడికి కూడా పాన్‌కార్డు లేదని ఎన్నికల అఫిడవిట్‌లో కనిమొళి పేర్కొన్నారని సౌందరరాజన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. కనిమొళి మొత్తంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఇటీవల గవర్నర్ నిర్ణయించి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అందుకు అనుమతిచ్చింది.