ICC: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1కు చేరువైన కోహ్లీ!
- రెండు పాయింట్ల తేడాతో కొద్డిలో నెం.1 మిస్
- పుణె టెస్టులో దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ
- మూడో టెస్టులో రాణిస్తే టాప్ లో కోహ్లీనే!
టెస్టుల్లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని కొద్దిలో మిస్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి ఐసీసీ పాయింట్ల పట్టికలో 37 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రెండు పాయింట్లు సాధిస్తే.. కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకునేవాడు. ఈ అవకాశం కొద్దిలో తప్పిపోయింది. గత ఏడాదిలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న కోహ్లీ అనంతర కాలంలో ఆసీస్ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
తాజాగా భారత్ లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా పుణెలో ఆదివారంతో ముగిసిన రెండో టెస్టులో కోహ్లీ ద్విశతకం (254 నాటౌట్ 336 బంతులు, 33 బౌండరీలు, 2 సిక్సర్లు) చేశాడు. ఈ పరుగులతో ఐసీసీ పట్టికలో కోహ్లీ మొత్తం 936 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, స్మిత్ 937 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ రాంచీ వేదికగా శనివారం ప్రారంభం కానుంది. ఇందులో రాణిస్తే కోహ్లీ మళ్లీ నెంబర్ వన్ అయ్యే అవకాశాలున్నాయి.
అటు బౌలర్లలో స్పిన్నర్ అశ్విన్.. తన సత్తా చాటుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగుల్లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. పుణె టెస్ట్ లో అశ్విన్ 6 వికెట్లు తీసి తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో అశ్విన్ 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.