Damayanti Ben: ఫిర్యాదు చేసిన యువతి ప్రధాని అన్న కూతురని పోలీసులకు తెలియదట!
- శనివారం నాడు దమయంతి మోదీ బ్యాగ్ చోరీ
- గంటల వ్యవధిలో చోరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఆమె మోదీ అన్న కుమార్తె అని తెలియదన్న ఢిల్లీ పోలీసు అధికారి
ప్రధాని నరేంద్ర మోదీ, అన్న కుమార్తె దమయంతి బెన్ మోదీ బ్యాగ్ చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగను పట్టేసుకున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా సెటైర్లు వేసింది. ప్రధాని దగ్గరి బంధువు, వరుసకు కుమార్తె కాబట్టే, పోలీసులు అంత త్వరగా స్పందించి, యంత్రాంగాన్ని మొత్తం రంగంలోకి దించి, దొంగను పట్టేశారని, సాధారణ ప్రజలైతే, అంత త్వరగా చోరులను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నలు ఎదురయ్యాయి. తమపై వస్తున్న సెటైర్లకు ఢిల్లీ పోలీసులు స్పందించారు.
"ఈ ఫిర్యాదును స్వీకరించినప్పుడు, ఆ యువతి ఎవరో మాకు తెలియదు. ఆమె ఓ వీఐపీ కుటుంబానికి చెందినవారని తెలియకుండానే ఫిర్యాదును స్వీకరించాము. కేసును రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించాం. నిందితుడు పాత నేరస్తుడే కావడంతో వెంటనే దొరికిపోయాడు" అని నార్త్ జోన్ డీసీపీ మౌనికా భరధ్వాజ్ వెల్లడించారు.
కాగా, తానిచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీసులకు దమయంతి బెన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఆమె శనివారం నాడు ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆటో దిగుతుండగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె బ్యాగ్ ను దొంగిలించి ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, గంటలు గడవక ముందే దొంగను అదుపులోకి తీసుకున్నారు.