Odisha: చితికి నిప్పు పెట్టేముందు లేచి కూర్చున్న వ్యక్తి.. చూసేందుకు తరలివస్తున్న జనం!
- ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
- మేకలు మేపేందుకు వెళ్లి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి
- చలనం లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారణ
చితికి నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా శ్వాస తీసుకుంటున్న వ్యక్తిని చూసి బంధువులు సహా అక్కడనున్న వారంతా షాకయ్యారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది తెలిసిన జనం అతడిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా లావుఖాలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన సిమాంచల్ మల్లిక్ (52) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూనే శనివారం మేకలను మేపేందుకు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు.
సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినా మల్లిక్ మాత్రం రాలేదు. దీంతో గాభరాపడిన కుటుంబ సభ్యులు అడవిలోకి వెళ్లి అతడి కోసం గాలించారు. ఆదివారం ఉదయం ఓ చోట పడి ఉన్న మల్లిక్‌ను గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతడిని లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చలనం లేకపోవడంతో చనిపోయాడని భావించారు. ఇంటికి తీసుకెళ్లి బంధువులు, గ్రామస్థులకు సమాచారం అందించి అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు.
అనంతరం సాయంత్రం శ్మశానానికి తీసుకెళ్లి చితి పేర్చారు. దహనానికి సిద్ధమవుతున్న సమయంలో మల్లిక్‌లో కదలికలు ప్రారంభమయ్యాయి. శ్వాస తీసుకుంటున్న అతడిని గమనించిన కొందరు వెంటనే వెళ్లి చితిపై నుంచి కిందకి దింపి సపర్యలు చేయడంతో లేచి కూర్చున్నాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన జనం అతడిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.