tsrtc: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- వివిధ ఉద్యోగాలకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ
- డ్రైవర్‌కు రోజుకు రూ.1500, కండక్టరుకు వెయ్యి రూపాయలు
- ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సూపర్‌వైజర్లు, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బంది, ఐటీ ట్రైనర్ తదితర పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అనుభవం, అర్హత ఆధారంగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో తమ సమీపంలోని డిపో మేనేజర్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని తెలిపింది. ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో వేతనం చెల్లించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
డ్రైవర్‌కు రోజుకు రూ.1500, ఓల్వో, ఏసీ, మల్టీ యాక్సిల్ డ్రైవర్‌కు అయితే రోజుకు రూ. 2 వేలు, కండక్టర్‌కు రూ.1000, రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్లకు రూ.1500, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బందికి రూ.1000, ఐటీ ట్రైనర్‌కు రూ.1500 చొప్పున చెల్లించనున్నట్టు ప్రభుత్వం వివరించింది.