Dharmadi Satyam: బోటు వెలికితీతకు మరోసారి ప్రయత్నించనున్న ధర్మాడి సత్యం బృందం
- నెలరోజుల కిందట గోదావరిలో బోటు మునక
- ఇప్పటికీ గోదావరి గర్భంలోనే బోటు
- వెలికితీసేందుకు ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం
- మరోసారి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ను కోరిన ధర్మాడి సత్యం టీమ్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటును వెలికితీసేందుకు మరోసారి ప్రయత్నించాలని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను కలిసి అనుమతి మంజూరు చేయాలని కోరింది. సెప్టెంబరు 15న గోదావరిలో రాయల్ వశిష్ఠ బోటు మునిగిపోయి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృతి చెందారు. గల్లంతైన మరికొందరి మృతదేహాలు ఇప్పటికీ లభ్యం కాలేదు. అయితే బోటును వెలికితీసే బాధ్యతలు అందుకున్న కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం కొన్ని రోజుల క్రితం గోదావరిలో విఫలయత్నాలు చేసింది.
మూడ్రోజులపాటు శ్రమించినా కనీసం బోటు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేకపోయారు. అదే సమయంలో గోదావరికి మరోసారి వరద ఉద్ధృతి పెరగడంతో వెలికితీత ఆపరేషన్ నిలిపివేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి నెమ్మదించింది. ఈసారి ప్రయత్నించి బోటును తప్పకుండా వెలికితీస్తామని ధర్మాడి సత్యం బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి వెలికితీత పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.