Rajnath Singh: మన వద్ద రాఫెల్ ఉండుంటే పాకిస్థాన్ లో ప్రవేశించాల్సిన అవసరమే ఉండేది కాదు: రాజ్ నాథ్
- ఇటీవలే తొలి రాఫెల్ ను స్వీకరించిన రాజ్ నాథ్
- హర్యానా ఎన్నికల ప్రచారంలో రాఫెల్ గురించి వ్యాఖ్యలు
- వచ్చే వేసవి నాటికి మరికొన్ని రాఫెల్ విమానాలు వస్తాయని వెల్లడి
ఇటీవలే భారత్ తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఫ్రాన్స్ వెళ్లి రాఫెల్ ను స్వీకరించారు. తాజాగా హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాఫెల్ గురించి వ్యాఖ్యానించారు. కొన్ని నెలల కిందట మనవద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండుంటే పాకిస్థాన్ వెళ్లి ఉగ్రమూకలపై దాడులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, మన గగనతలం పరిధిలో ఉంటూనే శత్రువులను తుదముట్టించేవాళ్లమని తెలిపారు.
రాఫెల్ వంటి అద్భుత పోరాట విమానం లేనందువల్లే బాలాకోట్ వరకు వెళ్లాల్సివచ్చిందని, రాఫెల్ ఉంటే బాలాకోట్ లో ఉన్న ఉగ్రమూకలతో పాటు భారత గడ్డపై ఉన్న ముష్కరులను కూడా తరిమికొట్టేవాళ్లమని చెప్పారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాయుసేనగా ఉన్న భారత్ రాఫెల్ చేరికతో మరింత పరిపుష్టం అవుతుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే వేసవి నాటికి మరో 7 రాఫెల్ జెట్లు మనదేశానికి వస్తాయని వెల్లడించారు.