Team India: టీమిండియా వరల్డ్ రికార్డు... పుణే టెస్టులో సఫారీలు చిత్తు
- ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో సఫారీపై విక్టరీ
- 2-0తో సిరీస్ కైవసం
- సొంతగడ్డపై వరుసగా 11వ సిరీస్ విజయం
సొంతగడ్డపై టీమిండియా మరోసారి అద్వితీయ ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికా జట్టుతో పుణేలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై భారత్ కిది వరుసగా 11వ సిరీస్ విజయం. ఇది వరల్డ్ రికార్డు. మరే జట్టు కూడా సొంతగడ్డపై ఇన్నేసి సిరీస్ లు వరుసగా గెలవలేదు. భారత్ తర్వాతి స్థానంలో ఆసీస్ (వరుసగా 10 సిరీస్ విజయాలు) ఉంది.
ఇక పుణే టెస్టు మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరుకు 326 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కుప్పకూలారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 601/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 275 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా మరోసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
సఫారీల రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా సత్తా చాటారు. ఉమేశ్ యాదవ్, జడేజా మూడేసి వికెట్లు తీయగా, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్, షమీ చెరో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ డీన్ ఎల్గార్ (48) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ విజయంతో భారత్ మూడు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 254 పరుగులు సాధించిన కెప్టెన్ కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇరు జట్ల మధ్య సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 19న రాంచీలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ భారత్ వశమైన నేపథ్యంలో ఈ టెస్టు ఫలితం అప్రాధాన్యంగా మారింది.