India: సినిమాలు చూస్తుంటే తెలియట్లే.. దేశంలో ఆర్థిక మందగమనం లేదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
- దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది
- మూడు సినిమాలు ఒకే రోజు రూ.120 కోట్లు వసూలు చేశాయి
- ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు
దేశం ఆర్థిక మందగమనంలో సాగుతోందన్న వార్తల్లో నిజం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో పూర్తిగా ఆర్థిక పరిపుష్టత ఉందని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన సినిమాలే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ఒకే రోజు విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్లు సంపాదించాయని పేర్కొన్న ఆయన.. దీనిని బట్టే మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ సరికొత్త వాదన వినిపించారు.
దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయన్న ఆందోళన ఇక అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. అక్టోబరు 2న విడుదలైన మూడు సినిమాలు ఒకే రోజు రూ.120 కోట్లు ఆర్జించినట్టు సినీ విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పారని, ఆర్థిక పరిపుష్టత లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. అలాగే, తాము ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని గుర్తు చేశారు. కొంతమంది కావాలనే ఇలాంటి ప్రకటనలతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.