Narendra Modi: మోదీ, జిన్ పింగ్ మధ్య చర్చల్లో కశ్మీర్ ప్రస్తావనే రాలేదు: విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే
- మోదీ, జిన్ పింగ్ మధ్య చర్చలు
- వాణిజ్యం, పర్యాటకం తదితర అంశాలపై చర్చ
- అర్థవంతమైన చర్చలు జరిగాయన్న విదేశాంగ శాఖ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా దేశాధినేత షీ జిన్ పింగ్ మధ్య మరోమారు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. మహాబలిపురం విచ్చేసిన జిన్ పింగ్ తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్థవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. మోదీ, జిన్ పింగ్ దాదాపు 90 నిమిషాల పాటు అనేక కీలక అంశాల గురించి చర్చించారని, కానీ కశ్మీర్ అంశం మాత్రం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు.
అయితే పెరుగుతున్న తీవ్రవాదం ఇరు దేశాలకు మంచిది కాదని మోదీ, జిన్ పింగ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని గోఖలే పేర్కొన్నారు. ఇద్దరి మధ్య వాణిజ్యపరమైన విషయాలు, పర్యాటక రంగం తదితర అంశాలు చర్చకు వచ్చాయని వెల్లడించారు. ఇరువురి చర్చల అనంతరం భారత్, చైనా దేశాల ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయని వివరించారు. తదుపరి వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చలు ఉంటాయని, భారత్ తరఫున ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు చర్చల్లో పాల్గొంటారని గోఖలే తెలిపారు.
కాగా, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత పర్యటన ముగిసింది. ఆయన ఈ మధ్యాహ్నం చెన్నై నుంచి నేపాల్ బయల్దేరి వెళ్లారు. ఆయనకు విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, సీఎం పళనిస్వామి వీడ్కోలు పలికారు.