Dasara: పండగ సీజన్ లోనూ అంతంతే... సెప్టెంబర్ లో తగ్గిన వాహన అమ్మకాలు!
- దసరా సీజన్ లో సాగని అమ్మకాలు
- వరుసగా 11వ నెలలోనూ తగ్గిన విక్రయాలు
- ఆఫర్లు ఉన్నా ఆసక్తి చూపని కొనుగోలుదారులు
గడచిన దసరా సీజన్ లో... అంటే సెప్టెంబర్ లో వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో వరుసగా 11వ నెలలోనూ ఇండియాలో అమ్మకాలు తగ్గినట్లు అయిందని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. ఇండియాలో వాహన రంగం కుదేలు కావడం, పెరిగిన పన్నుల భారం, ఆర్థిక మాంద్యం కనిపిస్తుండటం, వడ్డీ రేట్లు తదితర కారణాలతో అమ్మకాలు తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో ప్రయానికుల వాహనాల అమ్మకాలు 2,23,317 యూనిట్లుగా నమోదైనాయని, గత సంవత్సరం ఇదే నెలలో 2,92,660 యూనిట్లను కంపెనీలు విక్రయించాయని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. 2019తో పోలిస్తే, 23.69 శాతం మేరకు అమ్మకాలు తగ్గాయని తెలిపింది. ఇక దీపావళి సీజన్ పై కన్నేసిన వాహన కంపెనీలు ఇప్పటికే పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. నిర్వహణ, అధిక వారంటీ, క్యాష్ బ్యాక్ లను ప్రకటించినా, అమ్మకాలు ఏ మేరకు పెరుగుతాయన్న అనుమానాలు మాత్రం వీడటం లేదు.