Virat Kohli: ఒక్క ఇన్నింగ్స్ తో ఎన్ని రికార్డులో... కోహ్లీ ఘనత!
- పూణే టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ
- టెస్టుల్లో 7000 పరుగులు సాధించిన భారత సారథి
- అనేక రికార్డులు కైవసం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కీర్తికిరీటంలో మరిన్ని ఘనతలు చేరాయి. దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ అనేక రికార్డులను సాధించాడు. అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ గానే కాదు, కెరీర్ లో 7000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.
- కెప్టెన్ గా వ్యవహరిస్తూ 40 సెంచరీలు కొట్టిన తొలి భారత బ్యాట్స్ మన్ కోహ్లీనే. అంతర్జాతీయ స్థాయిలో ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ కెప్టెన్ గా 41 శతకాలు నమోదు చేశాడు.
- అంతేకాదు, టెస్టు సెంచరీల విషయంలో పాంటింగ్ రికార్డును కూడా సమం చేశాడు. పాంటింగ్ సారథిగా వ్యవహరిస్తూ 19 సెంచరీలు చేయగా, సరిగ్గా కోహ్లీ కూడా కెప్టెన్ గా టెస్టుల్లో 19 శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.
- భారత క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్లలో నెంబర్ వన్ అయ్యాడు. కోహ్లీ ఖాతాలో ఇప్పుడు 7 ద్విశతకాలున్నాయి. కోహ్లీ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ (6), సచిన్ టెండూల్కర్ (6), రాహుల్ ద్రావిడ్ (5), సునీల్ గవాస్కర్ (4) ఉన్నారు.
- ఓ టెస్టు జట్టు కెప్టెన్ గా ఎక్కువసార్లు 150 పైచిలుకు స్కోర్లు సాధించిన క్రికెటర్ గా డాన్ బ్రాడ్ మన్ రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 9 సార్లు 150 పైచిలుకు స్కోర్లు సాధించగా, బ్రాడ్ మన్ 8 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో మైకేల్ క్లార్క్ (7), మహేల జయవర్ధనే (7), బ్రియాన్ లారా (7) ఉన్నారు.
- పూణే మ్యాచ్ లో కోహ్లీ 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఓ భారత కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత ధోనీ (224), సచిన్ (217) ఉన్నారు.
- టెస్టుల్లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో శిఖరాగ్రంలో ఉండగా, ఆ తర్వాత కోహ్లీ (26), ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (26), విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (26), ఇంజమాముల్ హక్ (25) ఉన్నారు.