Varla Ramaiah: ఎంపీ పదవి ఉంది కదా అని సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాయడం సరికాదు: విజయసాయిపై వర్ల రామయ్య వ్యాఖ్యలు
- విజయసాయిపై వర్ల రామయ్య ధ్వజం
- విజయసాయి 11 కేసుల్లో ముద్దాయి
- బెయిల్ పై బయట ఉన్న ముద్దాయి అంటూ వ్యాఖ్యలు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై కేసులు, ఆరోపణల వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ఎంపీ పదవి ఉంది కదా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సరికాదని అన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. విజయసాయి బెయిల్ పై బయట ఉన్న ముద్దాయి అని మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు.
అంతేగాకుండా, టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆమెపై వైసీపీ కార్యకర్త ప్రభాకర్ రెడ్డి పెట్టిన పోస్టులను వర్ల రామయ్య మీడియాకు చూపించారు. వైసీపీ కార్యకర్త ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంపైనా, ఇతర అరాచకాలపైనా టీడీపీ ఫిర్యాదు చేయడానికి వెళితే డీజీపీ కనిపించరని, అదే వైసీపీ వాళ్లు వస్తే మాత్రం డీజీపీ ఎదురెళ్లి స్వాగతం పలుకుతారని విమర్శించారు.