Andhra Pradesh: మా హయాంలో మేము ఇలాగే ప్రవర్తించి ఉంటే జగన్ తిరిగి ఉండేవారా?: నిమ్మకాయల చినరాజప్ప
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cbc8e31f1d721eae2847b014d364b50874e69240.jpg)
- ఇసుక కొరతను నిరసించే దీక్షను భగ్నం చేస్తారా!
- కార్మికులకు పనులు లేక వీధినపడుతున్నారు
- సీఎం జగన్ స్పందించరే!
కార్మికులు వీధినపడితే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. ఏపీలో నెలకొన్న కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ తమ నేతలు చేపట్టిన దీక్షను భగ్నం చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇసుక లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఇసుక కొరత కారణంగా కార్మికులకు పనులు లేక వీధినపడుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా పోలీసులపై ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో తాము ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ తిరిగి ఉండేవారా? అని ప్రశ్నించారు. కచ్చులూరు బోటు మునిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ, ఈ ప్రమాదం జరిగి ఇన్నిరోజులు గడుస్తున్నా బోటును వెలికితీయలేకపోయారని విమర్శించారు.