Supreme Court: సుదీర్ఘ పోరాటం తర్వాత భార్య నుంచి విడాకులు పొందిన భర్త!

  • భార్య వద్దన్నా పట్టుబట్టి విడిపోయిన భర్త
  • ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కలపడం సాధ్యం కాలేదు
  • అందుకే విడాకులు మంజూరు చేసినట్లు కోర్టు వ్యాఖ్య

పెళ్లయి నాలుగేళ్లు కాపురం చేశాక విభేదాలతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భర్తకు 22 ఏళ్ల తర్వాత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. ‘దంపతులను కలిసి ఉంచేందుకు మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు కలిసి ఉండడం అసాధ్యం అని గుర్తించాం. అందుకే విడాకులు మంజూరు చేస్తున్నాం’ అంటూ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు...హైదరాబాద్‌కు చెందిన ఈ దంపతులకు 1993లో పెళ్లయింది. నాలుగేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పిల్లలు కూడా పుట్టారు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు రావడంతో 1997లో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య నుంచి తనకు విడాకులు కావాలంటూ భర్త హైదరాబాదులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అయితే భార్య విడాకులకు అంగీకరించకపోవడంతో, కోర్టు మంజూరు చేయలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించినా, అక్కడా విడాకులు మంజూరు కాకపోవడంతో సుప్రీంకోర్టుకు అప్పీలు చేశాడు.    

ఇక్కడ కూడా భర్త నుంచి విడిపోయేందుకు భార్య సుముఖత చూపించ లేదు. దీంతో పలుమార్లు దంపతులకు కోర్టు కౌన్సెలింగ్‌ ఇప్పించింది. అయినా భర్త మనసు మారలేదు. దీంతో మరోమార్గం లేక న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘ఆ దంపతుల మధ్య మానసికంగా బంధం విచ్ఛిన్నమైంది. అందుకే మా ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్జికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి మహిళ ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఆమెకు శాశ్వతంగా ఏక మొత్తంలో మనోవర్తి ఇప్పించడానికి అనువైన కేసుగా దీనిని భావిస్తున్నాం. ఎనిమిది రోజుల్లో భర్త 20 లక్ష రూపాయలు డిమాండ్‌ డ్రాప్ట్‌ రూపంలో భార్యకు మనోవర్తి కింద చెల్లించాలి’ అంటూ ధర్మాసనం తీర్పునిస్తూ, వారికి విడాకులు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News